సహాయం చేయమని తనని వెతుకుంటూ వచ్చిన మిత్రుడిని సకల సంపదలను అనుగ్రహించిన శ్రీకృష్ణుడు


కుచేలుడు అని శ్రీకృష్ణునికి ఒక బాల్యమిత్రుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణోత్తముడు చాలా గొప్పవాడు, అభిమానధనుడు, విజ్ఞానవంతుడు, రాగద్వేషాలు లేనివాడు, పరమశాంతమూర్తి, ధర్మతత్పరుడు, జితేంద్రియుడు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. తన ఇంట దారిద్ర్యం దారుణంగా తాండవిస్తున్నా, ఎవరినీ దీనంగా యాచించి ఎరుగడు. తనంత తానుగా ప్రాప్తించిన కాసును కూడా పదివేలుగా భావించి, ఏదో ఒక విధంగా భార్యాపుత్రులను పోషిస్తూ వస్తున్నాడు. కుచేలుని భార్య మహాపతివ్రత. చక్కటి వంశంలో పుట్టిన సాధ్వి. ఒకరోజు పిల్లలు ఆకలి మంట చేత కృశించి ఎండిన పెదవులను నాలుకతో తడుపుకుంటూ చేతుల్లో ఆకులూ గిన్నెలూ పట్టుకుని తల్లి వద్దకు వచ్చి పట్టెడన్నం పెట్టమని అడుగుతుంటే, ఆమె మనసు క్షోభ భరించలేకపోతోంది. అందుకని, ఆమె భర్తతో  ఇలా తాండవిస్తూ ఉన్న పేదరికం బాగా బాధిస్తోంది కదా. దీని గురించి మీరు ఆలోచించడం లేదు. శ్రీకృష్ణుడు మీ బాల్యమిత్రుడు కదా. మీరు వెళ్ళి ఆ మహానుభావుడిని దర్శించండి. అతని కృపాకటాక్షం పొంది, దారిద్ర్యంతో తల్లడిల్లుతున్న పిల్లలను, నన్ను కాపాడండి. శ్రీకృష్ణుడు ఆశ్రితులను రక్షించేవాడు. సజ్జనుల ఎడ, భక్తుల ఎడ వాత్సల్యము కలవాడు. దయాసాగరుడు. యాదవులు తనను సేవిస్తుండగా, కుశస్థలీపురములో ఉన్నాడు కదా. ఒక్కసారి, ఆ శ్రీపతిని దర్శించండి. మిమ్మల్ని చూస్తే చాలు వెంటనే ప్రభువు మీకు అనంతమైన సంపదలు అనుగ్రహిస్తాడు. కలలోకూడా తన్నెన్నడూ స్మరించని పాపాత్ముడు అయినా, ఆపదలు చుట్టుముట్టి నప్పుడు, ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆ ఆశ్రిత రక్షకుడి పాదారవిందాలను మనసారా స్మరిస్తే చాలు. ఎలాంటి వాడిని అయినా కనికరిస్తాడు. అవసరమైతే తనను తానే అర్పించుకుంటాడు కదా. అంతటి మహానీయుడు నిరంతరం భక్తితో తనను సేవించే మీవంటి వారికి విశేషమైన సంపదలు ఇవ్వకుండా ఉంటాడా? అని అన్నది. అంత విన్న కుచేలుడు తన భార్యతో నీ వన్నట్లు శ్రీకృష్ణుడిని ఆశ్రయించడం పరమ కల్యాణప్రదమే. కాని శ్రీకృష్ణుడి  దగ్గరకు వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళడానికి కానుక ఏదయినా మన వద్ద ఉందా. భర్త అభిప్రాయం అంగీకరించిన కుచేలుని భార్య “అలాగే కానివ్వండి” అంది. పిమ్మట అతని చినిగిన పైట కొంగులో కొన్ని అటుకులు ముడివేసి ప్రేమతో ప్రయాణానికి సిద్ధం చేసింది. కుచేలుడు గోవింద దర్శనం అవుతుందనే ఉత్సాహంతో బయలుదేరాడు.

ద్వారకకు వెళుతూ దారిలోకుచేలుడు తనలో తాను “ద్వారకలోనికి నేను ఎలా వెళ్ళగలను? అత్యంత ప్రభావవంత మైన అంతఃపురంలో ఉన్న శ్రీకృష్ణుడి దర్శనం ఎలా లభిస్తుంది? ఒకవేళ ద్వారపాలకులు “నీవెక్కడ బ్రాహ్మణుడవయ్యా! ఇక్కడకి ఎందుకు వచ్చావయ్యా” అని నన్ను అడ్డగిస్తే నేనేమి చేయగలను? వారికి ఏదయినా బహుమానం ఇద్దామన్నా నేను కటికదరిద్రుడినే. ఏమివ్వగలను? ఇంతకూ నా అదృష్టం ఎలా ఉందో? అయినా, ఆ శ్రీకృష్ణుని కృపాకటాక్షం తప్ప మరొక మార్గం ఏమున్నది? ఆయన నన్నెందుకు ఉపేక్షిస్తాడు?” ఇలా అనుకుంటూ కుచేలుడు ద్వారక ప్రవేశించాడు. ఇలా అనుకుంటూ కుచేలుడు ద్వారకాపట్టణం రాజమార్గాన ముందుకు సాగిపోయి, కొన్ని ప్రాకారాలు దాటాక అక్కడ శ్రీకృష్ణుని పదహారువేల సతులతో ప్రకాశిస్తున్న సుందర సమున్నత మణిమయ స్వర్ణసౌధాలను చూసి కుచేలుడు పరమానందం చెందాడు. అతని కళ్ళలో ఆనందబాష్పాలు స్రవించాయి. ఒక అంగన మందిరంలో మగువలు వింజామరలు వీస్తుండగా హంసతూలికాతల్పం మీద శ్రీకృష్ణుడు సతీమణితో మాట్లాడుతున్నా ఆ మనోహర సౌందర్యమూర్తిని పద్మాక్షుని దర్శించాడు. దారిద్యం వల కూసించిపోయిన శరీరంతో చిరిగిన బట్టలతో కుచేలుడు వస్తుంటే అల్లంత దూరంలో చూసిన శ్రీకృష్ణుడు ఎంతో సంభ్రమంగా గబగబా పానుపు దిగాడు. ఆదరాభిమానాలతో కుచేలుని కెదురుగా వెళ్ళి శ్రీకృష్ణుడు అతనిని కౌగలించుకున్నాడు. స్నేహ పూర్వక అనురాగం ఉట్టిపడేలా స్వాగతం పలికి ఆప్యాయంగా తీసుకువచ్చి తన పాన్పు మీద కూర్చోబెట్టాడు. శ్రీకృష్ణుడు బంగారు కలశంలో నీళ్ళు తీసుకు వచ్చి ఆయన పాదాలను కడిగాడు. ఆ జలాన్ని భక్తితో శిరస్సు మీద చల్లుకున్నాడు. పిమ్మట మనోహర మైన కస్తూరి, పచ్చకర్పూరపు మైపూతలు తీసుకుని మనోజ్ఞ మైపూతలు కుచేలుని శరీరానికి ప్రీతితో అలది, మార్గాయాసం తీరేలా స్వయంగా ఆప్తమిత్రుడు కుచేలునికి విసన కఱ్ఱతో విసిరాడు. కుచేలుడికి కర్పూరతాంబూలం ఇచ్చి, గోదానం చేసి, ఆదరంగా కుశలప్రశ్నలు అడిగాడు. అప్పుడు కుచేలుడి శరీరం పులకించింది, కన్నుల నుండి ఆనందాశ్రువులు జాలువారాయి. శ్రీకృష్ణుని పట్టపురాణి రుక్మిణి  వింజామరము వీచింది. ఆ చల్లని గాలికి కుచేలుని మార్గాయాసం తీరింది. ఈ దృశ్యాన్ని చూసిన అంతఃపురకాంతలు విస్మయంతో ఇలా అనుకున్నారు. “ఈ బ్రాహ్మణోత్తముడు పూర్వజన్మలో ఎంతటి తపస్సు చేసాడో? మహా యోగులచేత పూజింపబడే శ్రీపతి పరుండు పానుపు మీద అధివసించాడు. ఎంతటి మహామునులు అయినా ఈ మహానుభావునికి సాటిరారు కదా. శ్రీకృష్ణుడు లేచి వెళ్ళి విప్రోత్తమునికి స్వాగతం చెప్పాడు. ప్రేమతో అతడిని కౌగలించుకున్నాడు. సముచితంగా సత్కరించాడు. ఎంతో వినయంగా పూజించాడు. ఇంతటి గౌరవం పొందిన ఈ బ్రాహ్మణోత్తముడు ఎంత అదృష్టవంతుడో కదా.” అని అనుకున్నారు. అప్పుడు కృష్ణుడు ప్రేమతో కుచేలుడి చేతిలో తన చేయి వేసి పట్టుకుని, తాము గురుకులంలో ఉన్నప్పుడు జరిగిన విశేషాలను ప్రస్తావించి, కృష్ణుడు ఆయనతో ఇలా అన్నాడు. "చక్కటి వేద పండితుల వంశంలో పుట్టిన సద్గుణశాలి అయిన నీ భార్య నీకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నదా? ఇంతకూ నీ మనస్సు గృహక్షేత్రాల మీద, భార్యాపుత్రుల మీద లగ్నమైనట్లు కనిపించుట లేదు. లోకకల్యాణం కోసం నేను కర్మాచరణలో ప్రవర్తించినట్లు లోకంలో కొందరు ఉత్తములు కామమోహాలకు వశం కాకుండా తమ విధ్యుక్తధర్మాలను నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి వారు ప్రకృతి సంబంధాలకు అతీతంగా ఉంటూ కర్తవ్య నిష్ఠతో జీవిస్తారు. మనం గురువుగారి నివాసంలో ఉన్నప్పుడు ఆచార్యుడు బోధించగా నేర్చుకోవలసినవి మనం వరుసగా నేర్చుకుని గొప్ప విజ్ఞానము గడించిన సంగతి నీకు జ్ఞాపకం ఉందా? మన గురువు అజ్ఞానం అనే చీకటికి దీపం లాంటివాడు. బ్రహ్మానందానుభవంలో నిమగ్నమైన చిత్తం కలవాడు. సత్కర్మ పరాయణుడు. బ్రాహ్మణ శ్రేష్ఠుడు. పుణ్యాత్ముడు. సకల వర్ణాశ్రమాలవారికీ నేను నిజానికి విజ్ఞానప్రదాత అయిన గురువును అయినా గురుసేవ అత్యున్నత ధర్మము అని బోధించడం కోసం నేను కూడ గురుసేవ చేసాను. మనం గురువు గారి ఆశ్రమంలో ఉన్న దినాలలో ఒకనాడు గురుపత్ని ఆజ్ఞానుసారం కట్టెలు తేవడానికి అడవికి వెళ్ళాము. గుర్తుంది కదూ. ఆ సమయంలో పెద్ద పెద్ద ఉరుములతో ఆకాశం అంతా భీకరంగా కారుమబ్బులు ఆవరించాయి. సుడిగాలులు మహా వేగంతో వీచి అడవి జంతువులను ఎగరగొట్టసాగాయి. వర్షధారలు దిగ్గజాలతొండా లంత పరిమాణంతో భూమిపై వర్షించాయి. మెరుపులు మిరుమిట్లు గొలిపాయి. వాన జడి పెరిగింది. సూర్యుడు అస్తమించాడు. వర్షం ఆగలేదు. చీకట్లు దట్టంగా వ్యాపించి, కంటికి ఏమీ కనపడటం లేదు. అలాంటి జడివానలో మనం తడిసి ముద్దయ్యాము. త్రోవలూ డొంకలూ ఎత్తు పల్లాలూ కనపడకుండా వాననీరు కప్పివేసింది. ఒకరి చేతిని ఒకరం ఊతగా పట్టుకుని మనం ఆ అడవిలో దారి కనపడక తిరిగాము. తీవ్రంగా వీచే గాలులకు మనం విపరీతంగా వణకసాగాం. మనం ఏం చేయలో తోచక, దిక్కూ తెన్నూ తెలియక అడవిలో తెగ తిరిగాము. అప్పుడు, ఎట్టకేలకు సూర్యోదయం అయింది. అప్పుడు, మన గురువుగారైన సాందీపని మహర్షి మనలను వెదుక్కుంటూ వచ్చాడు. వానలో తడిసి చలికి గజగజమని వణుకుతున్న మనల్ని చూసి విచారంతో ఇలా అన్నాడు. “అయ్యో! పిల్లల్లారా!మీరు ఎంత ఇబ్బంది పడ్డారు. కనుక, ఓ శిష్యులారా! మీరు మీ గురుఋణం తీర్చుకున్నారు. మీకు ధన దార బహు పుత్ర సంపదలూ దీర్ఘాయురున్నతులూ విజయశ్రీలు చేకూరగలవు.” అని ఆశీర్వాదించారు. ఇలా దీవించి, పిమ్మట గురువు సాందీపని వాత్సల్యంతో మనలను తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. ఇవన్నీ నీవు తలచుకుంటూ ఉంటావా?” అని కుచేలునితో శ్రీకృష్ణుడు మళ్ళీ ఇలా అన్నాడు. పుణ్యాత్మా! అప్పుడు, మనం చదువుకుంటూ అన్యోన్య స్నేహవాత్సల్యాలతో మెలగిన తీరులు నీవు మర్చిపోలేదు కదా?” ఈ విధంగా శ్రీకృష్ణుడు తమ చిన్ననాటి ముచ్చటలను గుర్తుచేసుకుంటూ పలికిన మధుర వచనాలను విని కుచేలుడు ఉప్పొంగిపోతూ ఇలా అన్నాడు. దామోదరా! గురువుగారి ఆశ్రమంలో సంతోషంతో మనం చేయని పనులు ఏమైనా అసలు ఉన్నాయా? అది అలా ఉండనీ కాని నా మాట విను. మురారీ! ముల్లోకాలకూ గురుడవు అన తగిన నీకు గురుడు అంటూ ఇంకొకడు ఉంటాడా? తెలివిగా ఆలోచించి చూస్తే ఇదంతా నీ లీలలే తప్ప మరేమీ కాదు.” అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కుచేలుడితో “నీ విక్కడికి వస్తూ నా కోసం ఏమి తెచ్చావు? ఆ వస్తువు లేశమైనా పదివేలుగా స్వీకరిస్తాను. నాపై భక్తి లేని నీచుడు మేరుపర్వత మంత పదార్థం ఇచ్చినా, అది నాకు అంగీకారం కాదు. అందుచేత పత్రమైనా ఫలమైనా పుష్పమైనా జలమైనా సరే భక్తితో నాకు సమర్పిస్తే దానిని మధురాన్నంగా భావిం చి స్వీకరిస్తాను.” అని అన్నాడు. శ్రీకృష్ణుడి మాటలకూ కుచేలుడు సంతోషించి తాను తెచ్చిన అటుకులను శ్రీకృష్ణుడికి ఇవ్వలేక తలవొంచుకొని కూర్చున్నాడు. కుచేలుడు వచ్చిన కారణాన్ని శ్రీకృష్ణుడు గ్రహించాడు. పూర్వజన్మ నుండి ఇతడు ఐశ్వర్యాన్ని కోరి నన్ను సేవించినవాడు కాదు. ఇప్పుడు తన భార్య సంతోషం కోసం నా దగ్గరకు వచ్చాడు. కావున ఇంద్రాదులకు సైతం లభించని సకల సంపదల్ని ఈక్షణమే ఇతనికి ఇవ్వాలని భగవంతుడు భావించాడు. తన చినిగిన ఉత్తరీయంలో ముడివేసి కుచేలుడు తీసుకువచ్చిన అటుకులను చూసి, కృష్ణుడు ఆలా అన్నాడు. ఇదేమిటి అని అడుగుతూ ముడి విప్పి అటుకులు గుప్పెడు తీసుకున్నాడు, “నాకూ సమస్త లోకాలకూ సంతృప్తి కలిగించడానికి ఇవి చాలు.” అంటూ కృష్ణుడు ఆ అటుకుల్ని ఆరగించాడు. శ్రీపతి తీసుకున్న ఆ పిడికెడు అటుకుల్ని ఆదరంగా తిన్న తరువాత, మళ్ళీ ఇంకొక్క పిడికెడు తీసుకుంటున్నాడు. ఇంతలో, రుక్మిణీదేవి తన రెండు చేతులతో భర్త చేయి పట్టుకుని వారిస్తూ ఇలా అన్నది. ఓ శ్రీహరీ! ముజ్జగాలకు సంపద లొసగు వాడా! ఈ కుచేలుడికి సకల సంపదలను అందించడానికి మీరు ఆరగించిన గుప్పెడు అటుకులే చాలు. ఇక స్వీకరించకండి.”అలా భర్తను రుక్మిణీదేవి వారించింది. పిమ్మట, కుచేలుడు నాటి రాత్రి శ్రీకృష్ణుని మందిరంలో తనకు ఇష్టమైన రకరకాల పదార్ధాలు అన్నీ భుజించాడు. మెత్తని పానుపు మీద పవళించి తాను స్వర్గభోగాన్ని అనుభవిస్తున్నంతగా సంతోషించాడు. మరునాడు తెలవారగానే అతడు కాలకృత్యాలు అన్నీ తీర్చుకుని, తన ఊరికి బయలుదేరాడు. శ్రీకృష్ణుడు తన అప్తమిత్రుడిని కొంతదూరం కూడా వచ్చి సాగనంపాడు. ఆ నందనందనుడు అయిన శ్రీకృష్ణుని దర్శించిన  ఆనందంతో నిండిన అక్కరతో కుచేలుడు వెళుతూ తనలో తాను ఇలా అనుకున్నాడు. ఆహా ఏమి నాపుణ్యం? ఆ పుణ్యల రాశిని; పరమ శాంతుని; అచ్యుతుని; అఖిల వ్యాపకుని; చిన్మయ స్వరూపుని; పర మాత్మను; పురు షోత్తముని; శ్రీకృష్ణపరమాత్మను దర్శించ గలిగాను. మందుడను అయిన నే నెక్కడ? లక్ష్మికి నిత్యనివాస మైన వాసుదేవు డెక్కడ? అచ్యుతుడు అనురాగంతో నన్ను తన తోడబుట్టినవాడిలా కౌగిట చేర్చాడు. దేవుడితో సమానమైన వాడిలా భావించి తన పానుపు మీద కూర్చోబెట్టుకున్నాడు. పూని నన్ను గొప్పగా సత్కరించాడు. ఆయన పట్టపుదేవి రుక్మిణీదేవి నాకు వింజామర వీచింది. నా శ్రమను పోగొట్టింది. అతిశయించిన వాత్సల్యంతో శ్రీకృష్ణుడే సాక్షాత్తూ లక్ష్మీదేవిని లాలించే తన చందనాలు అలదిన పాణిపల్లవాలతో ఆప్యాయంగా నా పాదా లొత్తాడు. మహా సంపన్నుడు అయిన శ్రీకృష్ణుడు నన్ను గొప్పగా సత్కరించాడు. కానీ దరిద్రుడుకి సంపదలు లభిస్తే గర్వాంధుడై తనను సేవించడని కాబోలు ధనము మాత్రం ఏమీ ఇవ్వలేదు అనుకుంటాను. లేకపొతే ఆశ్రితజనుల ఆర్తిని బాపే అంబుజాక్షుడు, అపార కృపా సముద్రుడు, నాకు సకల సంపదలు అనుగ్రహించకుండా ఉంటాడా?” ఈ విధంగా ఆలోచనలతో కుచేలుడు పయనించి తన ఊరికి చేరుకున్నాడు. అక్కడ కుచేలుడు తన కళ్ళేదుట సూర్యచంద్రుల కాంతితో ప్రకాశించే పాలరాతి మేడలు, శుక, పిక, మయూరాల కూజితాలతో అలరారే చక్కటి ఉద్యానవనాలు, వికసించిన అనేక వన్నెల తామరలతో కలువలతో కనులపండువుగా ఉన్న సరోవరాలు, మణికంకణాలు మున్నగు రకరకాల భూషణాలూ ధరించి ప్రకాశిస్తున్న దాస దాసీజనము కలిగిన భవనాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. “ఏ పుణ్యాత్ముని భవనమో ఇది సిరిసంపదలకు నిలయముగా అపూర్వంగా ప్రకాశిస్తున్నది.” ఇలా అనుకుంటూ సంకోచిస్తున్న సమయంలో దేవకాంతల వంటి యువతులు కుచేలుని దగ్గరకు వచ్చి, “ఇటు దయచేయండి.” అంటూ స్వాగతం పలికారు. సంగీత నృత్య వాద్యాలతో అతడిని అంతఃపురం లోనికి తీసుకుని వెళ్ళారు.కుచేలుడు ఇలా వస్తుండటం చూసిన ఆయన భార్య చాలా సంతోషించింది. ఆ ఇల్లాలు తన భర్త ఎదురుగా వస్తుంటే చూసి, ఎంతో ఆనందంతో ఎదురువచ్చింది. అప్పుడు ఆమె అపర మహాలక్ష్మిలా ఉంది. కృష్ణుని అనుగ్రహంవలన కలిగిన ఐశ్వర్య వైభవాలకు ఆ భార్యాభర్తలు ఇద్దరు అత్యంత ఆనందాన్ని పొందారు. ఆ భవనం లోనికి కుచేలుడు సతీసమేతంగా ఆనందంగా ప్రవేశించాడు. కుచేలుడు ఆ దివ్యభవనంలో ఎలాంటి మనోవికారాలకూ లోనుకాకుండా సుఖంగా జీవిస్తూ, తన నిర్మలమైన మనసున ఇలా అనుకున్నాడు “ఇన్నాళ్ళూ దుర్భరమైన దారిద్ర్య దుఃఖసాగరంలో తపించాను. ఇప్పుడు చివరికి ఈ వైభవం కలిగింది. ఈ సరిక్రొత్త సంపదలు సమస్తం శ్రీహరి కృపాకటాక్షం వలననే నాకు ప్రాప్తించాయి కదా. నేను శ్రీకృష్ణుని సన్నిధికి అర్థకాంక్షతో వెళ్ళడం ఆ మహానుభావుడు నా సంగతి అంతా గ్రహించినా నన్నేమీ అడగలేదు. నాకు వీడ్కోలిచ్చి పంపాడు. ఈ సకల సంపదలూ అనుగ్రహించి ధనవంతుడిని చేసాడు. భగవంతుడు, భక్తితత్పరులైన సజ్జనులు సమర్పించిన వస్తువు రవ్వంతే అయినా దానిని కోటానుకోట్లుగా స్వీకరించి, భక్తులను అనుగ్రహిస్తాడు అనడానికి నా వృత్తాంతమే తార్కాణం. మాసిన నా శరీరాన్ని చినిగిన బట్టలను చూసి శ్రీకృష్ణుడు మనస్సులో నైనా ఏవగించుకోలేదు. నా దగ్గర ఉన్న అటుకులను ప్రీతిగా ఆరగించాడు. నన్ను ధన్యుణ్ణి చేయడం దామోదరుని నిర్హేతుకవాత్సల్యం మాత్రమే. అంతటి కరుణాసాగరుడైన గోవిందుని పాదారవిందాల మీద నాకు నిండైన భక్తి నెలకొని ఉండు గాక.” అని ఈ మాదిరి తలుస్తూ హరిస్మరణం మరువకుండా కుచేలుడు తన ఇల్లాలితో కలసి జీవించాడు. భోగాలపై ఆసక్తి లేకుండా, రాగద్వేషాది ద్వంద్వాలకు అతీతుడై, నిర్వికారుడై, హరిభక్తి సుధారస వాహినిలో ఓలలాడుతూ, భవబంధాలను బాసి మోక్షాన్ని అందుకున్నాడు. 













కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...